YS Avinash Reddy: అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంది.. ఆయన దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు: కోర్టులో సీబీఐ కౌంటర్
- వివేకా హత్య కేసులో అవినాశ్ కు బెయిల్ వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు
- అవినాశ్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా దర్యాప్తుకు సహకరించడం లేదన్న సీబీఐ
- అవినాశ్ కు నేర చరిత్ర ఉందని వెల్లడి
- హత్య కుట్రలో ఎవరి ప్రమేయం ఉందో తెలియాల్సి ఉందని వివరణ
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసుకు సంబంధించి సీబీఐ తెలంగాణ హైకోర్టులో ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో కీలక అంశాలను పొందుపరిచింది. దర్యాఫ్తును పక్కదారి పట్టించేందుకు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నట్టు సమాచారం.
అవినాశ్ రెడ్డి దురుద్దేశపూరితంగానే దర్యాఫ్తుకు సహకరించడం లేదని, విచారణ సందర్భంగా సమాధానాలు దాటవేశారని, వాస్తవాలు చెప్పలేదని కౌంటర్ లో పేర్కొన్నారు. అతనిని అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆయన అనుచరుల వల్లే దర్యాఫ్తుకు ఆటంకం కలిగిందని, అతనికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదన్నారు. దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నారు. అవినాశ్ కు నేర చరిత్ర ఉందని, నాలుగు క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నట్లు తెలిపింది.
వివేకా పీఏ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర రెడ్డి వంటి సాక్షులను ప్రభావితం చేసినట్లు వెల్లడైందని తెలిపింది. అలాగే హత్య తర్వాత సాక్ష్యాలను చెరిపివేయడంలో ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపింది. కుట్రలో భాగంగా ఆధారాలు చెరిపేశారన్నారు. సునీల్ - అవినాశ్ మధ్య సంబంధం తెలియాల్సి ఉందని, కుట్రలో ఎవరెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావాల్సి ఉందని పేర్కొన్నారు. మార్చి 15న అవినాశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియాల్సి ఉందని పేర్కొంది.