cyclone: వచ్చేవారం తూర్పు తీర ప్రాంతాలకు సైక్లోన్ మోచా ముప్పు!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి
- సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక
- తొమ్మిదో తేదీ నాటికి తుపానుగా బలహీనపడే అవకాశం
వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముందని, మరుసటి రోజున అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది.
ఆ తర్వాత తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై తొమ్మిదో తేదీ నాటికి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను ఏర్పడితే దానికి మోచా అని పేరు పెట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. యెమెన్ దేశంలోని పోర్ట్ నగరం మోచా పేరు మీదుగా ఈ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. అల్పపీడనం తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపింది. వచ్చే వారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు నలభై నుండి యాభై కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.