Rahul Gandhi: రాహుల్ గాంధీకి లభించని ఊరట.. స్వయంగా హాజరు కావాల్సిందేనన్న ఝార్ఖండ్ కోర్టు
- దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
- 2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో రాహుల్ వ్యాఖ్యలు
- మోదీ ఇంటి పేరు ఉన్న వారందరినీ రాహుల్ అవమానించారంటూ ఝార్ఖండ్‌లో కేసు
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన రాహుల్
‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యలు చేసి పరువునష్టం కేసు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఝార్ఖండ్ కోర్టులో చుక్కెదురైంది. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసులోనే సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఝార్ఖండ్ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదని రాహుల్‌కు తేల్చి చెప్పేసింది.
అసలింతకీ కేసేంటి?
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ మాట్లాడుతూ.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్రమోదీ.. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రదీప్ మోదీ అనే న్యాయవాది రాంచీలో రాహుల్‌పై కేసు పెట్టారు.
మోదీ అనే ఇంటిపేరు ఉన్న వారినందరినీ రాహుల్ అవమానపరిచారని, వారి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ పరువునష్టం కేసు వేశారు. ఇదే విషయంలో రాహుల్‌పై ఝార్ఖండ్‌లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి చైబసాలో కాగా, రెండు రాంచీలో నమోదయ్యాయి.