Congress: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధినేత ఖర్గే తనయుడికి ఈసీ నోటీసులు
- చర్యలు ఎందుకు తీసుకోకూడదో రేపటిలోగా చెప్పాలని నోటీసులు
- చేతకాని వ్యక్తి అంటూ ప్రధాని మోదీపై విమర్శలు
- చిత్తాపూర్ నుండి బరిలోకి దిగిన ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ, మోదీపై నలయక్ (చేతకాని వ్యక్తి) అంటూ వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో నోటీసుకు మే 4 సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ పేర్కొంది. ప్రధాని మోదీపై అనుచిత పదజాలం ఉపయోగించారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రియాంక్ చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.