Agastya Chauhan: యూట్యూబ్ వీడియో కోసం 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపి దుర్మరణం పాలైన యూట్యూబర్ అగస్త్య
- మోటార్ బైక్ రేసింగ్ కోసం ఢిల్లీ వెళ్తుండగా ఘటన
- 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రయత్నంలో అదుపు తప్పిన బైక్
- యమునా ఎక్స్‌ప్రెస్ వేపై డివైడర్‌ను ఢీకొట్టిన అగస్త్య
- ముక్కలైన హెల్మెట్.. తలకు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మృతి
యూట్యూబ్ వీడియో కోసం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపిన ప్రొఫెషనల్ బైకర్, యూట్యూబర్ అగస్త్య చౌహాన్ దుర్మరణం పాలయ్యాడు. ‘జడ్ఎక్స్ 10ఆర్ నింజా సూపర్ బైక్’పై ప్రయాణిస్తూ తన యూట్యూబ్ చానల్ కోసం 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్‌ను నియంత్రించడంలో విఫలమైన అగస్త్య డివైడర్‌ను ఢీకొట్టాడు. అతడు ధరించిన హెల్మెట్ ముక్కలైంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అగస్త్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి చుట్టూ రక్తం మడుగుకట్టింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య ఢిల్లీలో జరిగే మోటార్ బైక్ రేసింగ్ పోటీ కోసం ఆగ్రా నుంచి బైక్‌పై బయలుదేరాడు. ‘ప్రొ రైడర్ 1000’ పేరుతో అగస్త్య ఓ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. దానికి 1.2 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రమాదానికి 16 గంటల ముందు యూట్యూబ్‌లో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఢిల్లీకి రావాలని తన స్నేహితులను అందులో కోరాడు. అగస్త్య తన చానల్లో వీడియోను అప్లోడ్ చేసిన ప్రతిసారీ డిస్క్లైమర్ వేసేవాడు. బైక్‌ను వేగంగా డ్రైవ్ చేయొద్దని కోరేవాడు. ఇప్పుడు అతడే అధిక వేగంతో ప్రయాణించి దుర్మరణం పాలయ్యాడు.