The Kerala Story: తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ విడుదలైతే నిరసనలు తప్పవు.. హెచ్చరించిన నిఘా వర్గాలు
- ఇస్లాం పుచ్చుకుని ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళ మహిళల కథగా సినిమా
- ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’
- సినిమాను నిషేధించాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- రేపు దేశవ్యాప్తంగా విడుదల
- అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిఘా వర్గాలు
బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించింది. విపుల్ అమృత్‌లాల్ షా ఈ సినిమాను నిర్మించారు. కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాం పుచ్చుకుని ఆపై కరుడుగట్టిన తీవ్రవాద గ్రూపు ఇస్లామిక్ స్టేట్‌లో చేరడం వంటి ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ సినిమాపై ట్రైలర్ తర్వాతి నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని పలువురు ప్రకటించారు. అయితే, తమ సినిమాలో అవాస్తవాలు లేవని, ఇప్పటి వరకు 32 వేలమంది మహిళలు మతం మారారని, యథార్థ ఘటనల ఆధారంగానే ఈ సినిమాను రూపొందించినట్టు చిత్ర బృందం చెబుతోంది.
తాజాగా ఈ సినిమాపై నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తమిళనాడులో కనుక ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఖాయమంటూ నిఘా వర్గాలు తమిళనాడు పోలీసు శాఖను హెచ్చరించాయి. ఫలితంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. కాబట్టి ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడులో సినిమా విడుదల కాకుండా చూడాలని చెప్పింది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్ చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటారని పోలీసుల వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు (5న) దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది.