Wrestlers to return medals: ఈ మెడల్స్ ను వెనక్కి ఇచ్చేస్తాం: అవమానభారంతో రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా
- ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు
- తాము పద్మశ్రీ అవార్డ్ గ్రహీతలనే విషయాన్ని వాళ్లు పట్టించుకోలేదన్న బజరంగ్
- పతకాలు, అవార్డులు వెనక్కిచ్చి సాధారణ జీవితాన్ని గడుపుతామని వ్యాఖ్య
- మమ్మల్ని ఇప్పటికే చాలా అవమానించారు.. ఇంకేం మిగల్లేదన్న వినేశ్ ఫోగట్
ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ప్రకటించారు. న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న తమను అవమానాలకు గురిచేస్తున్నపుడు ఈ గౌరవం తమకెందుకని రెజ్లర్లు ప్రశ్నించారు.
ఓ మైనర్ సహా ఏడుగురు రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23వ తేదీ నుంచి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిరసనలు చేస్తున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రెజ్లర్లు, పోలీసు సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో వినేశ్ ఫోగట్ సోదరుడు గాయపడ్డారు.
ఢిల్లీ పోలీసులు తమను దుర్భాషలాడుతూ, తమతో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే.. భారత ప్రభుత్వం తమకు అందించే గౌరవాలు ఏ మాత్రం ఉపయోగపడవని అన్నారు. ‘‘రెజ్లర్లు కూడా పద్మశ్రీ అవార్డ్ గ్రహీతలనే విషయాన్ని వాళ్లు పట్టించుకోలేదు. వారు (పోలీసులు) మాపై దౌర్జన్యం చేశారు. దూషించారు’’ అని అన్నారు.
‘‘మా రెజ్లర్ల పట్ల ఇలాగే వ్యవహరిస్తే, మేం పతకాలను ఏం చేసుకుంటాం? దీనికి బదులుగా మేం సాధారణ జీవితాన్ని గడుపుతాం. అన్ని పతకాలు, అవార్డులను భారత ప్రభుత్వానికి తిరిగి ఇస్తాం’’ అని ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, అంతర్జాతీయ వేదికలపై సాధించిన మెడల్స్ ను వెనక్కి ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. వినేశ్ ఫోగట్ జోక్యం చేసుకున్నారు. ‘‘మొత్తం తీసేసుకోండి. మమ్మల్ని ఇప్పటికే చాలా అవమానించారు. ఇంకేం మిగల్లేదు’’ అని అన్నారు.
రెజ్లర్ల నిరసనలను రాజకీయ పార్టీలు హైజాక్ చేశాయన్న విమర్శలపై ప్రశ్నించగా.. ‘‘చూడండి.. ఇది రాజకీయమే. దయచేసి ప్రధానిని మాతో మాట్లాడేలా చేయండి. మమ్మల్ని పిలవమని హోం మంత్రిని అడగండి. మాకు న్యాయం చేయండి. మేం మా కెరీర్ను, మా జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్నాం’’ అని చెప్పారు.