IPL: ఉప్పల్‌లో సన్ రైజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్... ఈసారి రైజ్ అయ్యేది ఎవరో?
- గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచిన హైదరాబాద్
- ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతాతో పోరులో రైజర్స్ దే విజయం
- మరో విక్టరీపై కన్నేసిన సన్ రైజర్స్
వరుసగా మూడు ఓటముల తర్వాత గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. గురువారం సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీ పడనుంది. ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి ఆరు పాయింట్లతో సన్ రైజర్స్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది. కోల్ కతా 9 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 6 ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది.
ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు విజయం అత్యంత కీలకం కానుంది. దాంతో, అన్ని విభాగాల్లో సత్తా చాటి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని హైదరాబాద్ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గత మ్యాచ్ లో ఢిల్లీపై ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ శర్మ, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ సత్తా చాటారు.
కేకేఆర్ పై గెలవాలంటే మాత్రం టాపార్డర్ మొత్తం రాణించాల్సి ఉంటుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. ఇదే కోల్ కతాపై ఈడెన్ గార్డెన్స్ లో హ్యారీ బ్రూక్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో, ఈ పోరులో 23 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. మరోసారి కేకేఆర్ ను ఓడించాలని సన్ రైజర్స్ భావిస్తోంది.
మరోవైపు సొంతగడ్డపై సన్ రైజర్స్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కేకేఆర్ కోరుకుంటోంది. హైదరాబాద్ తో పోలిస్తే కేకేఆర్ బ్యాటింగ్ బలంగా ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత పోరులో ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ భారీ ఇన్నింగ్స్ తో సత్తా చాటగా... జాసన్ రాయ్ రాకతో మరింత బలోపేతం అయింది. రాణా, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి హిట్టర్లు ఆ జట్టు సొంతం. వీరిని హైదరాబాద్ బౌలర్లు అడ్డుకుంటేనే సన్ రైజర్స్ కు మరో విజయం సొంతం అవుతుంది.