46 Runs In One Over: ఇదేందయ్యా.. ఒకే ఓవర్ లో 46 పరుగులు.. సిక్సుల వర్షం.. వీడియో వైరల్!
- కేసీసీ టీ20 చాంపియన్స్ ట్రోఫీలో బ్యాట్స్ మన్ విధ్వంసం
- ఏకంగా 6 సిక్సులు కొట్టిన ఎన్ సీఎం బ్యాట్స్ మన్ వాసు
- వీడియో వైరల్.. ఎలా సాధ్యమంటూ నెటిజన్ల కామెంట్లు
ఒక ఓవర్ లో అత్యధికంగా ఎన్ని పరుగులు చేయొచ్చు? ఆరు బంతులు సరిగ్గా వేస్తే గరిష్ఠంగా 36 పరుగులు చేసేందుకు చాన్స్ ఉంటుంది. అది కూడా ప్రతి బాల్ ను సిక్స్ కొడితేనే. మరి ఒకే ఓవర్ లో 46 పరుగులు కొడితే? అసలు ఇది సాధ్యమేనా? కానీ ఓ టీ20 టోర్నమెంట్ లో జరిగింది.
కువైట్ లో ప్రస్తుతం ‘కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 చాంపియన్స్ ట్రోఫీ’ జరుగుతోంది. ఎన్ సీఎం ఇన్వెస్ట్ మెంట్, ట్యాలీ సీసీ మధ్య మ్యాచ్ జరిగింది. ఎన్ సీఎం బ్యాట్స్ మన్ వాసు సిక్సర్ల వర్షం కురిపించాడు. ట్యాలీ జట్టు బౌలర్ హర్మన్ 15వ ఓవర్ వేయగా.. 6 (నో బాల్), 4 (బైస్), 6, 6 (నో బాల్), 6, 6, 6, 4 కొట్టాడు. రెండు నో బాల్స్, ఆరు సిక్సులు, రెండు ఫోర్లు.. మొత్తంగా 46 పరుగులు రాబట్టాడు.
అతడి దెబ్బకు జట్టు స్కోరు 15 ఓవర్లలోనే 230కి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలా ఎలా సాధ్యమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘15 ఓవర్లలోనే 230 పరుగులా? ఇదేమైనా జోక్ నా?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డులను పరిశీలిస్తే.. వన్డేల్లో ఒక ఓవర్ లో అత్యధిక స్కోరు 36. 2006లో నెదర్లాండ్స్ జట్టుపై సౌతాఫ్రికా ప్లేయర్ హర్షలే గిబ్స్ కొట్టాడు. 2021లో పపువా న్యూ గునీవా జట్టుపై యూఎస్ఏ బ్యాట్స్ మన్ జాస్కరన్ మల్హోత్రా కొట్టాడు.
ఇక టెస్టుల్లో టీమిండియా స్పీడ్ స్టార్ జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఈ బ్యాటింగ్ రికార్డు ఉంది. 2022లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఓవర్ లో 35 పరుగులు రాబట్టాడు.
ఇక టీ20ల్లో అత్యధిక స్కోరు 36. తొలిసారి టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. తొలి టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ పై ఆరు బంతుల్లో 6 సిక్సులు కొట్టి రికార్డు నెలకొల్పాడు. 2021లో శ్రీలంకపై వెస్టిండీస్ ప్లేయర్ కీరెన్ పొలార్డ్ కూడా 36 పరుగులు కొట్టాడు.
కానీ ఓవర్ లో 46 పరుగులు కొట్టడం మాత్రం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఇదిగో ఆ వీడియో మీరూ చూసేయండి.