Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. దానికో ప్రత్యేకత!
- నేడు ‘పెనుంబ్రల్ లూనార్’
- మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే
- భారత్‌లో గ్రహణ ప్రభావం ఉండదన్న ప్లానెటరీ సొసైటీ
- వదంతులు నమ్మవద్దని సూచన
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడు ఏర్పడబోతోంది. రాత్రి 8.42 గంటలకు మొదలై అర్ధరాత్రి దాటిన తర్వాత 1.04 గంటల వరకు గ్రహణం ఉంటుంది. నేటి గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ‘పెనుంబ్రల్ గ్రహణం’ అంటారు. ఇది భారత్‌లో కనిపించదని ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ తెలిపారు. గ్రహణ ప్రభావం భారత్‌లోనూ ఉంటుందని వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. అలాగే, పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావం ఉంటుందని చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
అసలేంటీ పెనుంబ్రల్ లూనార్?
సాధారణంగా చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి వెలుపలి నీడలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు చంద్రుడు క్రమంగా చీకట్లోకి వెళ్లిపోవడం కనిపిస్తుంది కానీ, పూర్తిగా అదృశ్యం కాడన్నమాట. అంటే మనకు లీలగా కనిపిస్తూనే ఉంటాడన్నమాట. నిజానికిది ఖగోళ అద్భుతం. మళ్లీ ఇలాంటి గ్రహణం సెప్టెంబరు 2042లో కనిపిస్తుంది.
కాగా, ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా నేటితో రెండు పూర్తవుతాయి. ఏప్రిల్ 20న సూర్యగ్రహణం సంభవించగా, నేడు చంద్రగ్రహణం. అక్టోబరు 14న మరో సూర్యగ్రహణం వస్తుండగా, అక్టోబరు 28-29 తేదీల్లో రెండో చంద్రగ్రహణం సంభవిస్తుంది.