IPL 2023: ఆ ఓవర్‌లో నా గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంది: వరుణ్ చక్రవర్తి
- హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి
- 9 పరుగులు ఇవ్వకుండా అద్భుత బౌలింగ్
- తన ప్లాన్ పనిచేసిందని వెల్లడి
సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా, వరుణ్ చక్రవర్తి బంతి అందుకున్నాడు. నిజానికి ఆరు బంతుల్లో 9 పరుగులు రాబట్టడం పెద్ద విషయం కాదు. కాబట్టి హైదరాబాద్ విజయం పక్కా అని అందరూ డిసైడైపోయారు. అయితే, వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ హైదరాబాద్ విజయాన్ని అడ్డుకున్నాడు.
వరుణ్ వేసిన తొలి బంతిని అబ్దుల్ సమద్ సింగిల్ తీశాడు. దీంతో హైదరాబాద్ లక్ష్యం 5 బంతులకు 8 పరుగులుగా మారింది. రెండో బంతికి లెగ్‌బై రూపంలో మరో పరుగు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ విజయానికి 4 బంతుల్లో 7 పరుగులు అవసరం. అప్పటికీ విజయంపై హైదరాబాద్ ధీమాగానే ఉంది. అయితే, మూడో బంతికి సమద్ అవుట్ కావడంతో ఎస్ఆర్‌హెచ్‌లో కంగారు మొదలైంది.
క్రీజులోకి వచ్చిన మాయాంక్ మార్కండే పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో హైదరాబాద్ చివరి రెండు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఐదో బంతికి మార్కండే సింగిల్ తీశాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు అటెన్షన్ లోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ గెలవాలంటే చివరి బంతికి సిక్సర్ అవసరం. క్రీజులో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఏమైనా జరగొచ్చన్న టెన్షన్ ఇరు జట్లలోనూ కనిపించింది. అయితే, చివరి బంతిని వరుణ్ పకడ్బందీగా సంధించడంతో భువీ పరుగులు రాబట్టుకోలేకపోయాడు. కోల్‌కతా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఆ ఓవర్ వేస్తున్నప్పుడు తన గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుందని పేర్కొన్నాడు. బంతి అందుకోవడానికి ముందే ఓ వ్యూహం రచించుకున్నానని, బ్యాటర్‌ని లాంగర్ ఎండ్ నుంచి సవాలు చేయాలనుకున్నానని, అదొక్కటే తన ఆశ అని అన్నాడు. తన తొలి ఓవర్‌లో మార్కరమ్ 12 పరుగులు పిండుకున్నాడని, అందులో రెండు ఫోర్లు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. కాబట్టే ఈ ప్లాన్ రచించినట్టు చెప్పాడు.
గతేడాది బౌలింగుకు, ఈ ఏడాది బౌలింగుకు మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడుతూ.. గతేడాది తాను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్టు గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఎన్నో విషయాలను ట్రై చేశానని, కానీ చేయాల్సింది అది కాదని తెలుసుకున్నానని పేర్కొన్నాడు. రివల్యూషన్స్‌పై పనిచేయాల్సిన అవసరం ఉందని భావించి అలాగే చేశానని, అది పనిచేసిందని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగుతో జట్టుకు విజయాన్ని అందించిపెట్టిన వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.