Five day working: బ్యాంకులు పనిచేసేది వారంలో ఐదు రోజులే
- బ్యాంకుల యాజమాన్యాలు, యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం
- ప్రైవేటు బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అంగీకరిస్తేనే..
- కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు వెళ్లనున్న ప్రతిపాదన
వారంలో బ్యాంకుల సేవలు భవిష్యత్తులో ఐదు రోజులకు పరిమితం కానున్నాయి. బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాలు ఎప్పటి నుంచో ఈ దిశగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యూనియన్స్ మధ్య సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో ప్రైవేటు, కోఆపరేటివ్ బ్యాంకులను ఇంకా ఒప్పించాల్సి ఉంది. అప్పుడే వారంలో ఐదు రోజుల పని విధానం అమల్లోకి రానుంది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ దీనిపై చర్చలు ముగించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు. ఆర్ బీఐ, ప్రైవేటు బ్యాంకుల, కోఆపరేటివ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యాజమాన్యాలతోనూ చర్చలు అవసరమని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ప్రైవేటు బ్యాంకులు తెరిచి ఉంటే, అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేయడం వల్ల వాటి వ్యాపారం దెబ్బతినకుండా చూడాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం బ్యాంకులు వారంలో ఆరు రోజుల పని విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రతీ రెండు, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. నూతన విధానంలో వారంలో ఐదు రోజులే పని విధానం ఉంటుంది. మరి వారంలో ఐదు రోజులే అంటే బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకని ఐదు రోజులకు తగ్గించడం వల్ల నష్టం వాటిల్లకుండా, రోజువారీ పని వేళలను పెంచనున్నారు. రోజుకు 40 నిమిషాల చొప్పున అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ సైతం తన ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనికి అంగీకారం తెలిపింది. దీంతో ఇది మరిన్ని రంగాలకు పాకేలా కనిపిస్తోంది.