- ఏఐ సురక్షితమేనన్న భరోసా అవసరం అన్న బైడెన్
- జాతీయ భద్రతకు ముప్పుగా మారకూడదని సూచన
- చట్టపరమైన బాధ్యత ఉండాలన్న కమలా హ్యారిస్
అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీల సీఈవోలతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గురువారం భేటీ అయ్యారు. ఏఐ ఉత్పత్తులను వినియోగానికి తీసుకొచ్చే ముందు అవి సురక్షితమేనని నిర్ధారించుకోవాలని వారికి బైడెన్ సూచించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏడాది ఎంతో ప్రచారానికి నోచుకుంటున్న విషయం తెలిసిందే. చాట్ జీపీటీ ఎన్నో సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. దీనికి వచ్చిన ఆదరణతో సెర్జింజిన్ దిగ్గజం గూగుల్ బార్డ్ పేరుతో అప్లికేషన్ ను తెచ్చింది. ఇది కూడా చాట్ జీపీటీ మాదిరే పనిచేస్తుంది.
ఈ తరహా టూల్స్ ను లక్షలాది మంది పరీక్షిస్తున్నారు. స్క్రీన్ ప్లే, రెజ్యూమే, ఇలా కావాల్సిన ప్రతి అంశంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాట్ జీపీటీ ప్రత్యేకత. దీంతో టెక్నాలజీతో గోప్యతకు భంగం కలుగుతుందన్న ఆందోళన మొదలైంది. చాట్ జీపీటీని అమెరికా అధ్యక్షుడు సైతం పరీక్షించి చూశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) వ్యక్తులు, సమాజం, జాతీయ భద్రతకు ముప్పుగా మారకుండా రిస్క్ లను అధిగమించాలని బైడెన్ సూచించినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు తమ ఏఐ సిస్టమ్స్ విషయంలో విధానకర్తలతో పారదర్శకంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సమావేశం ఎత్తి చూపించింది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ జీవితాలను మెరుగుపరుస్తుంది. కానీ, భద్రత, గోప్యత, పౌర హక్కుల విషయంలో ఆందోళనలకు కారణమవుతోంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు భద్రమేనంటూ చట్టపరమైన బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే ఈ విషయంలో నూతన చట్టాలను తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.