Ravi Shastri: ఐపీఎల్ ట్రోఫీ.. వరుసగా రెండోసారీ ఆ జట్టుదేనట.. అంచనా వేసిన రవిశాస్త్రి
- గుజరాత్ టైటాన్స్ మరోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటుందన్న రవి శాస్త్రి
- ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని వెల్లడి
- రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంప్సన్ పైనా ప్రశంసలు
- కెప్టెన్ గా అతడు ఎంతో పరిణితి చెందాడని వ్యాఖ్య
ఫుల్ జోష్ తో మొదలైన ఐపీఎల్ 2023 ‘ఫస్ట్ హాఫ్’ పూర్తయింది. కోహ్లీ- గంభీర్ ల హైఓల్టేజ్ వాగ్వాదంతో ‘ఇంటర్వెల్’ పడింది. మూడు జట్లు మినహా మిగతావన్నీ ఇంకా రేసులో ఉండటం, పాయింట్ల పట్టికలో స్వల్ప తేడాలే ఉండటంతో ‘సెకండ్ హాఫ్’ మరింత మజా ఇచ్చేలా ఉంది. నాలుగైదు జట్లు గట్టి పోటీనిస్తున్నాయి.
ఈ క్రమంలో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి.. ఐపీఎల్ 2023తో విన్నర్ ఎవరనేది అంచనా వేశారు. గుజరాత్ టైటాన్స్ మరోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే కప్ కొట్టి గతేడాది గుజరాత్ రికార్డు సృష్టించింది. నిలకడైన ఆట తీరుతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొలిస్థానంలో ఉన్న గుజరాత్ దే టైటిల్ అని రవిశాస్త్రి అంచనా వేశారు.
‘‘గుజరాత్ ఆడుతున్న తీరు, పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఉన్న స్థితిని చూడండి. గెలిచేది గుజరాతేనని నేను నమ్ముతున్నా. ఏడు, ఎనిమిది మంది ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు’’ అని వివరించారు.
రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంప్సన్ పైనా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘‘కెప్టెన్ గా సంజూ పరిణితి చెందాడు. స్పిన్నర్లను బాగా ఉపయోగించుకుంటున్నాడు. మంచి కెప్టెన్ మాత్రమే ముగ్గురు స్పిన్నర్లతో ఆడగలడు.. వాళ్లను తెలివిగా ఉపయోగించుకోగలడు’’ అని కొనియాడారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. 9 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న లక్నో, చెన్నై జట్లకు 11 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్, బెంగళూరు, ముంబై, పంజాబ్ జట్లకు 10 పాయింట్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ, హైదరాబాద్ అట్టడుగున ఉన్నాయి.