Jammu And Kashmir: నిన్న పేలుడు జరిగిన చోటే నేడు ఎదురుకాల్పులు
- జమ్మూకశ్మీర్ లో లష్కరే తోయిబా టెర్రరిస్టు కాల్చివేత
- కొనసాగుతున్న భద్రతాబలగాల ఆపరేషన్
- జీ 20 సదస్సు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
జమ్మూకశ్మీర్ లోని బారాముల్లాలో శుక్రవారం జరిగిన ఐఈడీ పేలుడులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.. తాజాగా శనివారం ఉదయం కూడా అదే ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిందని, భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని ఎస్ఎస్ పీ అమోద్ అశోక్ మీడియాకు వివరించారు. జమ్మూకశ్మీర్ లో వరుస ఉగ్ర దాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. త్వరలో కశ్మీర్ లో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.
బారాముల్లాలోని కర్హామా కుంజర్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందినట్లు ఎస్ఎస్ పీ అమోద్ తెలిపారు. దీంతో శనివారం ఉదయం భద్రతా బలగాలు ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని వివరించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని అధికారులు పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాది దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందినవాడని, లష్కరే తోయిబా ఉగ్రవాది అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.