Joe Biden: భారతీయ అమెరికన్ నీరా టాండన్ కు అమెరికాలో కీలక పదవి
- దేశీ విధానాల రూపకల్పన సలహాదారుగా నియామకం
- ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- ప్రస్తుతం బైడెన్ కు సీనియర్ అడ్వైజర్ గా పనిచేస్తున్న టాండన్
అమెరికాలో మరో భారతీయ మహిళను కీలక పదవి వరించింది. భారతీయ అమెరికన్ నీరా టాండన్ ను దేశీయ విధానాల సలహాదారుగా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. అమెరికాలో దేశీయ విధానాల రూపకల్పన, అమలులో ఆమె తన వంతు సాయం అందించనున్నారు. ‘‘ఆర్థిక చైతన్యం, జాతీయ సమానత, ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్, విద్య తదితర అంశాలలో విధానాల రూపకల్పన, అమలును నీరా టాండన్ ముందుకు తీసుకెళ్లనున్నారని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను’’ అని జో బైడెన్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జో బైడెన్ కు దేశీ విధానాల రూపకల్పన సలహాదారుగా సుసాన్ రైస్ ఉన్నారు. రైస్ స్థానంలో టాండన్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ విధానాలకు సంబంధించి దేశీయంగా ముగ్గురు సలహాదారులు ఉంటారు. ఆసియా అమెరికన్ కు ఈ తరహా పదవి లభించడం ఇదే మొదటిసారి. సీనియర్ అడ్వైజర్, స్టాఫ్ సెక్రటరీగా ఉన్న నీరా టాండన్, దేశీయ, ఆర్థిక, జాతీయ భద్రత బృందాలతో కలసి ఇప్పటికే నిర్ణయాల రూపకల్పనను పర్యవేక్షిస్తున్నట్టు బైడెన్ గుర్తు చేశారు. టాండన్ ప్రస్తుతం జో బైడెన్ కు సీనియర్ అడ్వైజర్ గా, స్టాప్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.