scientists: ఒడిశా గిరిజనుల ఆరోగ్య రహస్యం గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు
- అక్కడి గిరిజన ప్రజల పేగుల్లో ప్రత్యేకమైన బ్యాక్టీరియా
- దీని పేరు లిగిలాక్టోబేసిల్లస్ శాలివేరియస్ ఎఫ్14
- దీని కారణంగా వారిలో బలమైన ఆరోగ్యం
భువనేశ్వర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఆరోగ్యాన్ని కలిగించే ఓ కొత్తరకం ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను గుర్తించారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఈ బ్యాక్టీరియా నిరోధించగలదని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా పేరు ‘లిగిలాక్టోబేసిల్లస్ శాలివేరియస్ ఎఫ్14’. ఒడిశాలోని గిరిజన ప్రజల పేగుల్లో ఈ బ్యాక్టీరియాను గుర్తించడం విశేషం.
ఒడిశాలోని గిరిజన ప్రాంతాల ప్రజలు ఇతరులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటుండడంతో దీనిపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఇది ఆరంభమైంది. ఒడిశా గిరిజనుల ఆరోగ్యానికి కారణమవుతున్న అంశాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వారి పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పైన పరిశోధన సాగించారు. అప్పుడు ఈ కొత్త బ్యాక్టీరియా విషయం వారికి తెలిసింది.
ప్రోబయోటిక్ అనేవి మన పేగుల్లో ఉంటూ మనకు మంచి చేసేవి. మన శరీరంలోకి ప్రవేశించే చెడు బ్యాక్టీరియాపై పోరాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ప్రోబయోటిక్ ఔషధాల రూపంలోనూ లభిస్తాయి. ‘‘ఈ సూక్ష్మజీవులు జంతువులు, మనుషులకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి. డయేరియా, స్థూలకాయం, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణనిస్తాయి’’ అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరి పరిశోధనా అంశాలు వరల్డ్ జర్నల్ ఆఫ్ బయోటెక్నాలజీలో ప్రచురితమయ్యాయి.