Telangana: కొత్త బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి.. పోలీసు శాఖ కొత్త ప్రతిపాదన!

Soon Buying Two helmets is must to register new bike in telangana

  • రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యం
  • కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రోడ్డు భద్రతామండలి
  • త్వరలో ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారుల వెల్లడి

రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, ప్రభుత్వ అనుమతితో త్వరలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలోనే రెండు హెల్మెట్లు కూడా తీసుకోవడం తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇంట్లో రెండు హెల్మెట్లు ఉంటే ఆటోమేటిక్ గా బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తారని అంటున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలు తగ్గుతాయని చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ద్విచక్రవాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. దీంతో పాటు బైక్ పై వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని రవాణా శాఖ రూల్ తీసుకొచ్చింది. అయితే, ఇది పెద్దగా అమలు కావడంలేదని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాలలో వెనక కూర్చున్న వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి కారణం వారు హెల్మెట్ ధరించకపోవడమేనని చాలా ఘటనలలో గుర్తించామని చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్లు తీసుకోవడం తప్పనిసరి చేసేలా నిబంధనలలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు పోలీస్ శాఖలోని రోడ్డు భద్రతామండలి ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనుందని సమాచారం.

  • Loading...

More Telugu News