NT Rama Rao: ఆ సినిమాలో జయసుధను కాకుండా జయప్రదను పెట్టుకోమని ఎన్టీఆర్ అనడానికి కారణం అదే: నిర్మాత ప్రసన్న కుమార్
- ఎన్టీ రామారావు వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన నిర్మాత
- 'అన్నా వదిన'లో ముందుగా జయసుధను అనుకున్నారని వెల్లడి
- జయప్రద ఇబ్బందులను గురించి మాట్లాడిన ఎన్టీఆర్
- దర్శకుడిని పిలిపించి మాట్లాడారని వివరణ
ఎన్టీ రామారావు గురించి ఆయన సన్నిహితులంతా ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ .. "ఒకసారి చదలవాడ శ్రీనివాసరావుగారు .. తిరుపతిరావుగారు అన్నగారి దగ్గరికి వెళ్లారు. తమ సినిమా ఓపెనింగ్ కి రమ్మని ఆయనను ఆహ్వానించారు.
హీరో ఎవరు? అని అన్నగారు అడిగితే, కృష్ణంరాజు అని చెప్పారు. ఆయన కథానాయికగా జయసుధను అనుకుంటున్నట్టుగా చెప్పారు. 'జయసుధ గారు హ్యాపీగానే ఉన్నారు కదా .. ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు. జయప్రద గారు ఏవో చికాకుల్లో ఉన్నట్టుగా తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెను తీసుకుంటే, ఆమెకి కాస్త ధైర్యంగా ఉంటుంది కదా" అన్నారు.
ఆ సినిమాకి డైరెక్టర్ పీసీ రెడ్డి అని తెలిసి, ఆయనను పిలిపించి మాట్లాడారు. అలా కృష్ణంరాజు సినిమాలో జయప్రదకి అవకాశం దక్కింది. ఆ సినిమా పేరే 'అన్నా వదిన'. నిజానికి ఎన్టీ రామారావుగారికి ఎన్నో పనులు. అయినా ఆయన ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకుని, ఆ సమస్యల్లో నుంచి వాళ్లను బయటపడేసేవారు" అని చెప్పుకొచ్చారు.