Karnataka: ఖర్గే హత్య కుట్రపై విచారణ జరుపుతాం: కర్ణాటక సీఎం బొమ్మై
- ఖర్గే హత్యకు బీజేపీ అభ్యర్థి కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపణ
- కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్ గా పరిగణిస్తున్నామన్న ముఖ్యమంత్రి
- చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని వ్యాఖ్య
తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హతమార్చేందుకు బీజేపీ అభ్యర్థి కుట్ర చేశారని కాంగ్రెస్ పార్టీ చేసిన సంచలన ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. కాంగ్రెస్ నేత ఆరోపణలను తాము చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో తాము పూర్తి స్థాయిలో దర్యాఫ్తుకు ఆదేశిస్తామని చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.
కర్ణాటకలోని కల్బుర్గీ జిల్లా చిత్తాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియోను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా విలేకరుల సమావేశంలో వినిపించారు. ఖర్గేతో పాటు ఆయన భార్య, పిల్లలను కూడా అంతమొందిస్తానని కన్నడ భాషలో ఉన్న ఆడియోలో మాట్లాడుతున్నది బీజేపీ అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హత్యకు బీజేపీ నేత కుట్ర పన్నారని సుర్జేవాలా మండిపడ్డారు.
కాంగ్రెస్ పైన కన్నడ ప్రజలు చూపుతున్న అభిమానాన్ని బీజేపీ జీర్ణించుకోలేక హత్యా రాజకీయలు చేస్తోందన్నారు. మణికంఠ రాథోడ్ కు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బొమ్మై అండదండలు ఉన్నాయన్నారు. అయితే తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాథోడ్ కొట్టి పారేశారు. అది ఫేక్ ఆడియో క్లిప్ అని, ఓటమి భయంతో కాంగ్రెస్ ఈ అభాండాలు వేస్తోందన్నారు.