Phil Salt: 'సాల్ట్' సరిపోయింది... ఛేజింగ్ లో ఢిల్లీ పరుగుల విందు

Phil Salt destructive innings seals victory for Delhi Capitals

  • ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 182 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో ఛేదించిన వైనం
  • 45 బంతుల్లో 87 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్
  • 8 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం

ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసక ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 20 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే అందుకుంది. 

ఈ ఇన్నింగ్స్ లో ముఖ్యంగా చెప్పాల్సింది ఢిల్లీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గురించి. సాల్ట్ కేవలం 45 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ 8 ఫోర్లు, 6 సిక్సులతో బెంగళూరు బౌలర్లను ఉతికారేశాడు. బెంగళూరు టీమ్ లో సిరాజ్, హేజెల్ వుడ్, హసరంగ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నప్పటికీ సాల్ట్ విజృంభణ ఓ రేంజిలో సాగింది. 

ఢిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 22, మిచెల్ మార్ష్ 26 పరుగులు చేయగా... రిలీ రూసో 35 బంతులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన అక్షర్ పటేల్ ఓ భారీ సిక్స్ బాది అలరించాడు. రూసో విన్నింగ్ షాట్ గా భారీ సిక్స్ కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు అందుకుంది. 

ఆర్సీబీ బౌలర్లలో హేజెల్ వుడ్ 1, కర్ణ్ శర్మ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 126 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న బెంగళూరు జట్టు ఇవాళ 181 పరుగులను కాపాడుకోలేకపోయింది. 

కాగా, ఢిల్లీ బ్యాటింగ్ కొనసాగుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు ఆర్సీబీ బౌలర్ సిరాజ్ కు మధ్య వాగ్వాదం నెలకొంది. మరో ఓపెనర్ సాల్ట్... సిరాజ్ బౌలింగ్ లో షాట్ కొట్టి ఏదో అనగా... తమ ఆటగాడికి మద్దతుగా వార్నర్ ముందుకొచ్చాడు. దాంతో వార్నర్ కు సిరాజ్ కు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అంపైర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News