Bihar: మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. వీడియో ఇదిగో!
- బీహార్ లోని సాసారామ్ లో ఘటన
- కాలువలో తేలిన రూ.100, రూ.10 నోట్లు
- మురుగులోనే నోట్లను దక్కించుకునేందుకు జనం పోటీ
బీహార్ లోని సాసారామ్ పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. సిటీలోని ఓ మురగునీటి కాలువలో కరెన్సీ నోట్లు తేలుతూ కనిపించాయి. దీంతో వాటిని దక్కించుకోవడానికి జనం ఎగబడ్డారు. మురుగును, దుర్గంధాన్ని లెక్కచేయకుండా కాలువలోకి దిగి నోట్లు చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాలువలో కరెన్సీ నోట్లు తేలడంతో నీటి అడుగున నోట్ల కట్టలు ఉండొచ్చని జనం ఎగబడ్డారు. నీటిపైన తేలుతున్న నోట్లను ఏరుకోవడంతో పాటు అడుగున ఉన్న మట్టి, చెత్తలో గాలించారు. కొందరు అడుగున ఉన్న మట్టిని చేతులతో ఒడ్డుకుతెచ్చి నోట్ల కట్టల కోసం వెతికారు. అయితే, ఆ కరెన్సీ నోట్లు నకిలీవి కావొచ్చని కొంతమంది సందేహం వెలిబుచ్చారు. స్థానికుల సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని, అయితే కాలువలో తమకు కరెన్సీ నోట్లు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఇదంతా ఓ రూమర్ కూడా అయి ఉండొచ్చని వివరించారు.