Rohit Sharma: కెప్టెన్ ఆడాల్సిన షాట్ కాదది... ముందు కాళ్లకు పని చెప్పు: రోహిత్ శర్మపై గవాస్కర్ విమర్శలు

Sunil Gavaskar slams Rohit Sharma after failure against Chennai Super Kings
  • రోహిత్ శర్మ ఆటలో ఉన్నట్లుగా అనిపించడం లేదన్న సునీల్ గవాస్కర్
  • బ్రేక్ తీసుకుని, ఫ్రెష్‌గా తిరిగి రావడంపై ఆలోచించాలని సూచన 
  • గత నాలుగు ఇన్నింగ్స్‌లలో 5 పరుగులే చేసిన రోహిత్... రెండు సార్లు డకౌట్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరును లెజెండరీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తీవ్రంగా విమర్శించారు. రోహిత్ నిర్లక్ష్యంగా ఆడి ఔట్ అయ్యాడని, అది కెప్టెన్ ఆడే షాట్ కాదని అన్నారు. విశ్రాంతి తీసుకొని, ఫ్రెష్‌గా తిరిగి రావడంపై రోహిత్ ఆలోచించాలని సూచించారు. 

నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ వచ్చిన రోహిత్... ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. అంతకుముందు మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యాడు. తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో అతడు చేసిన పరుగులు 5 మాత్రమే. ఐపీఎల్‌లో అత్యధిక (16) డకౌట్‌లు అయిన ఆటగాడిగా ఎవ్వరూ కోరుకోని చెత్త రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ ‘‘అతను ఆటలో ఉన్నట్లుగా అనిపించడం లేదు. నేను తప్పు కావచ్చు... కానీ అతను ఆడిన షాట్ కెప్టెన్ ఆడే షాట్ కాదు. ఒక కెప్టెన్ జట్టు ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడు. మంచి ఆట ఆడి జట్టు మంచి స్కోర్‌ చేసేలా చేస్తాడు’’ అని చెప్పారు. 

‘‘పవర్ ప్లేలో రెండు వికెట్లు పోయాయి. ఇదే సమయంలో రోహిత్ ఫామ్ లో లేడు. అతడు ఫామ్ లో ఉండి ఉంటే.. నేను ఆ స్కూప్ షాట్‌ని అర్థం చేసుకోగలను. కానీ అంతకుముందు మ్యాచ్ లో అతడు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొట్టిన భారీ షాట్ అది. నీ మార్క్ చూపించాలని అనుకుంటే.. ముందు కాళ్లకు కాస్త పని చెప్పు. సింగిల్స్, డబుల్స్ తీయి. ఆ తర్వాత ఫోర్లు, సిక్సులకు ప్రయత్నించు’’ అని సూచించారు.

‘‘బహుశా అతడికి కొంచెం బ్రేక్ దొరికితే అది మేలు చేస్తుందేమో. ఇది రోహిత్, ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం’’ అని గవాస్కర్ చెప్పారు. ‘‘ప్రస్తుతానికి అతను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి’’ అని అన్నారు. 

శనివారం చెన్నైతో మ్యాచ్ లో ముంబయి 20 ఓవర్లలో 139 పరుగులకే పరిమితమైంది. రోహిత్ డకౌట్ కాగా... ఇషాన్ కిషన్, గ్రీన్, టిమ్ డేవిడ్... అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. నేహాల్ వాధేరా 64 పరుగులతో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 

తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గౌక్వాడ్, కాన్వే, శివమ్ దూబే రాణించారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చెన్నై ఎగబాకింది. ముంబయి ఆరో స్థానానికి పడిపోయింది.
Rohit Sharma
Sunil Gavaskar
Chennai Super Kings
Mumbai Indians

More Telugu News