Enforcement Directorate: చత్తీస్ గఢ్ లోనూ లిక్కర్ స్కామ్... ఛేదించిన ఈడీ!

ED busts Rs 2000 cr liquor scam in Chhattisgarh

  • నేతలు, అధికారులు కుమ్మక్కై రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణం!
  • చేధించామన్న ఈడీ
  • కీలక నిందితుడైన అన్వర్ ధేబార్ ను అరెస్టు చేసినట్లు ప్రకటన
  • వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడి

ఢిల్లీ తర్వాత తాజాగా చత్తీస్ గఢ్ లోనూ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగుతున్న రూ.2 వేల కోట్ల మద్యం కుంభకోణాన్ని ఛేదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.

ఈ కేసులో కీలక నిందితుడైన అన్వర్ ధేబార్ ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. కోర్టులో ప్రవేశపెట్టగా నాలుగు రోజుల ఈడీ కస్టడీకి జడ్జి అప్పగించారు. కాంగ్రెస్ నేత, రాయ్ పూర్ మేయర్ ఐజాజ్ ధేబార్ సోదరుడే అన్వర్ ధేబార్.

ఈ కేసుకు సంబంధించి ఈడీ గత మార్చిలోనే పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. స్కామ్ తో సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తుల స్టేట్ మెంట్లు రికార్డు చేసింది. ‘‘2019-2022 మధ్య కాలంలో రూ.2,000 కోట్ల మేరకు అవినీతి, మనీలాండరింగ్ జరిగిందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించామని ఈడీ వెల్లడించింది. 
 
చత్తీస్ గఢ్ లో అన్వర్ ఆధ్వర్యంలో వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ నడుస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో విక్రయించే ప్రతి మద్యం బాటిల్ నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు అన్వర్ విస్తృతమైన కుట్రను రూపొందించాడని, కుంభకోణాన్ని అమలు చేయడానికి వ్యక్తులు, సంస్థలతో భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులపై దృష్టి పెట్టినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News