Narne Venkata Subbaiah: మళ్లీ సీఎం అయ్యేందుకు జగన్ యాగాలు నిర్వహిస్తున్నారా?: హేతువాద సంఘం
- ఈనెల 12న విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం
- రూ. 10 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్నారని హేతువాద సంఘం ఆగ్రహం
- యాగాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్
ఈనెల 12న విజయవాడలో చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యాగం జరగనుంది. ఈ నేపథ్యంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. సీఎం పీఠాన్ని మళ్లీ అధిష్ఠించేందుకు జగన్ ఈ యాగాలను నిర్వహిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
యాగాలు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి తన సొంత డబ్బుతో నిర్వహించుకోవాలని... అధికారికంగా, ప్రభుత్వ స్థలాల్లో నిర్వహించడం సరికాదరని అన్నారు. రూ. 10 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ యాగాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హేతువాద సంఘం సభ్యుడు మోతుకూరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి.. ఇలాంటి మతపరమైన క్రతువును నిర్వహించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడం అవుతుందని అన్నారు. ఈ యాగంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పాల్గొనడం రాజ్యాంగానికి వ్యతిరేకమని విమర్శించారు.