Rahul Gandhi: ప్రియాంక గాంధీ తన పర్యటనలో ఈ విషయాన్ని గుర్తిస్తారు: కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అన్న మంత్రి
- బీఆర్ఎస్ విధానాల నుండి ప్రియాంక గాంధీ నేర్చుకోవాలని సూచన
- హైదరాబాద్ గ్లోబల్ సిటీ.. ప్రియాంక వంటి రాజకీయ పర్యాటకులకు కూడా స్వాగతమని వ్యాఖ్య
- రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను ఆలస్యం చేసిందని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అన్నారు. వారి పార్టీ తమ భారత రాష్ట్ర సమితి సమష్టి విధానాల నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. హైదరాబాద్లోని సరూర్నగర్లో సోమవారం యువ సంఘర్షణ సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులను స్వాగతించే గ్లోబల్ సిటీ హైదరాబాద్ అని, ప్రియాంక వంటి రాజకీయ పర్యాటకులను కూడా స్వాగతిస్తున్నామన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పని చేయని పార్టీలు ఇప్పుడు తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సుద్దులు చెబుతున్నాయని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులు తెలంగాణ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. యువతను, నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ తన రాజకీయాల కోసమే ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ లు బీఆర్ఎస్ పార్టీలా పని చేసి ఉపాధి విధానాన్ని ప్రకటించి ఉంటే దేశం నిరుద్యోగ సంక్షోభాన్ని చవిచూసేది కాదన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2.2 లక్షల మంది యువతకు ప్రభుత్వపరంగానూ, 22 లక్షల మంది యువతకు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పించిందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కార్యకలాపాలు, విధానాల నుంచి నేర్చుకొని, వాటిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రియాంక గాంధీకి సూచించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తూ వందలాది మంది తెలంగాణ యువత ప్రాణాలు తీసుకున్నందుకు కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని మునిగిపోతున్న నావగా మంత్రి అభివర్ణించారు. ప్రియాంక గాంధీ తన రాజకీయ యాత్రను స్టడీ టూర్ గా మార్చుకోవాలని సూచించారు. కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయానికి తోడ్పాటు వంటి వాటిపై కాంగ్రెస్ హయాంలో జరిగిన వైఫల్యాలను కేటీఆర్ ఎత్తి చూపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందన్నారు.
కాంగ్రెస్ పాలనకు పూర్తి విరుద్ధంగా బీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 24X7 విద్యుత్, రైతు బంధు, నిరుపేదలకు ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ తదితర పథకాలను అందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను ఎన్నుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తును కాపాడుకుంటారని, రాజకీయ పర్యాటకురాలైన ప్రియాంక గాంధీ ఈ పర్యటనలో ఈ విషయాన్ని గుర్తిస్తారని అన్నారు.