Lithium: రాజస్థాన్లో భారీగా లిథియం నిల్వలు.. జమ్మూకశ్మీర్ కంటే అధికం
- రాజస్థాన్లోని డేగానా ప్రాంతంలో వెలుగు చూసిన నిక్షేపాలు
- ఈ నిల్వల ద్వారా 80 శాతం భారత అవసరాలు తీరతాయి
- చైనాపై ఆధారపడటం దాదాపు తగ్గిపోవచ్చు
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా డేగానా మున్సిపాలిటీ పరిధిలో భారీగా లిథియం నిక్షేపాలు వెలుగు చూశాయి. ఈ మేరకు రాజస్థాన్ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికార వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నిల్వలతో 80 శాతం వరకు దేశీయ అవసరాలు తీరుతాయని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను గుర్తించగా, ఇప్పుడు అంత కంటే ఎక్కువ రాజస్థాన్ లో గుర్తించారు.
ఈ నిల్వల ద్వారా లిథియం కోసం చైనాపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయకారిగా మారుతుంది. లిథియం కోసం భారత్ ఇప్పటి వరకు చైనాపై ఆధారపడుతోంది. అయితే రాజస్థాన్లో ఈ నిల్వలను గుర్తించడంతో చైనా గుత్తాధిపత్యం తగ్గిపోతుందని, గల్ఫ్ దేశాల మాదిరిగా రాజస్థాన్ తద్వారా భారత్ కు ప్రయోజనకారిగా మారుతుందంటున్నారు.
లిథియం అనేది నాన్-ఫెర్రస్ మెటల్. దీనిని మొబైల్, ల్యాప్టాప్, ఎలక్ట్రిక్ వాహనం, ఇతర ఛార్జ్ చేయగల బ్యాటరీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. లిథియం కోసం భారత్ పూర్తిగా విదేశాలపై ఆధారపడుతోంది. నిన్న జమ్మూ కశ్మీర్, నేడు రాజస్థాన్ లో లిథియం నిల్వలు గుర్తించడం భారత్ కు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం లిథియం ఎగుమతుల్లో ఒక్క ఆస్ట్రేలియానే 47 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత చిలీ 30 శాతం, చైనా 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం లిథియంలో 58 శాతం ఒక్క చైనాలోనే ప్రాసెస్ అవుతోంది.
29 మార్చి 2023న పార్లమెంట్లో నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ ప్రశ్నకు కేంద్ర గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ... రాజస్థాన్లోని దేగానాలోని డేగానాలోని రెన్వత్ కొండలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా అధిక నాణ్యత కలిగిన లిథియం కోసం సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు GSI సర్వే బృందం G2 దశ సర్వేలో అధిక నాణ్యత గల టంగ్స్టన్తో పాటు లిథియం, 4 ఇతర ఖనిజాల నిక్షేపాలను కనుగొంది.