Uttar Pradesh: కొడుకు హత్యకు తెలివిగా ప్రతీకారం తీర్చుకున్న తండ్రి.. సినిమా స్టోరీని మించిన క్రైమ్... వివరాలు ఇవిగో!

UP farmer ensures sons killer bail then shoots him dead

  • బంధువుతో కలిసి సొంత కొడుకును చంపిన మహిళ 
  • భర్త జైలులో ఉండగా చోటు చేసుకున్న సంఘటన
  • అక్రమ సంబంధం బయటపడుతుందన్న భయంతోనే హత్య 
  • బయటకు వచ్చాక కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్న తండ్రి  

ఉత్తరప్రదేశ్ లో ఓ రైతు తన కొడుకును చంపిన హంతకుడ్ని బెయిల్ పై బయటకు రప్పించి, హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. ఖేరీ జిల్లాలోని మితౌలీ ప్రాంతంలో బంధువుతో కలిసి ఆ రైతు భార్య సొంత కొడుకును హత్య చేసింది. ఆ తర్వాత రైతు కాశీ కశ్యప్‌ (50) తన కుమారుడి హత్యకు ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. మే 5వ తేదీ రాత్రి తన బంధువు శత్రుధన్ లాలా (47) తలపై కాశీ కశ్యప్‌ మూడుసార్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  

2021లో కాశీ కశ్యప్ భార్య... తన సొంత కొడుకైన జితేంద్ర (14 ఏళ్లు)ను లాలా సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కాశీ కశ్యప్ మరో కేసులో జైలులో ఉండగా ఈ ఘటన జరిగింది. జితేంద్ర హత్య నిందితులైన కశ్యప్ భార్యను, లాలాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ కాశీ కశ్యప్ వారికి శిక్షపడినంత మాత్రాన ఊరుకోలేదు. తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

డిసెంబర్ 2022లో కాశీ జైలు నుండి విడుదలయ్యాడు. తనే న్యాయవాదిని నియమించడం ద్వారా లాలాకు బెయిల్ వచ్చేలా కాశీ చేశాడు. ఏప్రిల్ మొదటి వారంలో లాలాకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత లాలా కదలికలను కాశీ గమనించాడు. గత శుక్రవారం సాయంత్రం లాలా పొలం నుండి ఇంటికి వెళ్తుండగా కాశీ కశ్యప్ అతనిని కాల్చి చంపాడు. ఈ కేసులో కాశీకి వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు సేకరించారు.

కాశీ కశ్యప్ జైలుకు వెళ్లినప్పుడు జితేంద్ర హత్య


ఖేరీ జిల్లాలో ఓ వివాదంపై 2020లో జరిగిన హత్య కేసులో కాశీ కశ్యప్ సహ నిందితుడుగా ఉన్నాడు. ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది. దీంతో భార్య, మైనర్ కొడుకులను అత్తమామల ఇంటికి పంపించాడు. జితేంద్ర 2021లో కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత జితేంద్ర మృతదేహం నది ఒడ్డున గుర్తించారు. అతను ఎలా చనిపోయాడనే విషయం కొన్ని రోజుల వరకు ఎవరికీ తెలియరాలేదు.

అయితే కొన్ని నెలల తర్వాత కాశీ భార్య, లాలా మధ్య గొడవ జరిగింది. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు కాశీ భార్య, లాలా ఇద్దరూ జితేంద్రను చంపారని తెలుసుకుని పోలీసులు షాక్ కు గురయ్యారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కాశీ భార్య, లాలా సన్నిహిత స్థితిలో ఉండగా చూడడం జరిగిందనీ, దాంతో తమ అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో జితేంద్రను వారు హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

  • Loading...

More Telugu News