Roja: ఆఖరికి అశోక్ గజపతిరాజు కూడా సెల్ఫీలు తీసుకోవడం విడ్డూరంగా ఉంది: రోజా

Roja slams Ashok Gajapati Raju over selfie challenges
  • సెల్ఫీలు తీసి వైసీపీ సర్కారుకు సవాల్ విసురుతున్న టీడీపీ నేతలు
  • అశోక్ గజపతిరాజు తన జిల్లాకు ఏంచేశారన్న రోజా
  • ఒక్క కాలేజి కూడా తీసుకురాలేకపోయారని విమర్శలు
  • సెల్ఫీ డ్రామా చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టేనని వెల్లడి
ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు సెల్ఫీ చాలెంజ్ లతో విమర్శల దాడి చేస్తుండడం తెలిసిందే. నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన ఈ విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు అనుసరిస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైన చోట సెల్ఫీ దిగి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. 

దీనిపై రాష్ట్ర పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా స్పందించారు. ఆఖరికి అశోక్ గజపతిరాజు కూడా సెల్ఫీ తీసుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. అశోక్ గజపతిరాజు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా వ్యవహరించారని, మరి ఆయన తన సొంత జిల్లాకి ఏంచేశారో చెప్పగలరా? అని రోజా నిలదీశారు. జిల్లాకు ఒక్క కాలేజి కూడా తీసుకురాలేకపోయాడని, కేంద్ర మంత్రిగా పనిచేసినా జిల్లాకు విమానాశ్రయం తీసుకురాలేకపోయారని అశోక్ గజపతిరాజుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

జగనన్న పాలనను చూసైనా చంద్రబాబు, అశోక్ గజపతిరాజు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. సెల్ఫీలతో కాలక్షేపం చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని, సెల్ఫీలతో డ్రామా చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టేనని రోజా పేర్కొన్నారు.
Roja
Ashok Gajapathi Raju
Selfie Challenge
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News