Bopparaju: 1,650 మంది ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి: బొప్పరాజు
- ఉపాధ్యాయులను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న బొప్పరాజు
- విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపాటు
- ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని వ్యాఖ్య
ఉపాధ్యాయులను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వమేనని... అయినా జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని విమర్శించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని అన్నారు. ఉద్యోగులపై అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలను ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని అన్నారు. సీపీఎస్ ఉద్యమంలో భాగంగా 1,650 మంది ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.