Kakinada: కాకినాడ చెరువు నీటిలో విషం.. చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్న వేలాది చేపలు
- ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో విషం కలిపిన దుండగులు
- చెరువును లీజుకు తీసుకున్న ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల నష్టం
- స్థానికంగా కలకలం రేపుతున్న దుర్ఘటన
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని చేపలు ప్రాణాలు కోల్పోతున్నాయి. చనిపోయిన వేలాది చేపలు నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. దీంతో అక్వా రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయి కంటతడి పెడుతున్నారు. ఈ చెరువును కొందరు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. విషం కలిపిన నేపథ్యంలో మంచి బరువు పెరిగిన చేపలన్నీ చనిపోయాయి. మరోవైపు ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.