Hyderabad: హైదరాబాద్ లో ఉగ్ర కలకలం
- మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసుల సోదాలు
- 16 మందిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్
- గత 18 నెలలుగా నగరంలో మకాం పెట్టిన రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు
హైదరాబాద్ లో మరోమారు ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. నగరంలో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు.. మంగళవారం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి సిటీలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పలుచోట్ల సోదాలు జరిపి భోపాల్ కు చెందిన 11 మందితో పాటు హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలలో జిహాదీ మెటీరియల్, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు వివరించారు. నగరంలో గడిచిన 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ కేసుల వివరాలతో పాటు వీరితో సంబంధం ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.