Virender Sehwag: ఆ నిర్ణయం ఎవరిది? కోచ్ దా?.. కెప్టెన్ దా?: లక్నో టీమ్ పై సెహ్వాగ్ మండిపాటు

Whose Decision Was That Coach Or Captain Virender Sehwag Blasts LSG After Defeat Against GT
  • హై స్కోరింగ్ మ్యాచ్ లో లక్నోపై గెలిచిన గుజరాత్
  • బ్యాటింగ్ ఆర్డరే కొంపముంచిందన్న సెహ్వాగ్
  • దీపక్ హుడాను పంపినప్పుడే లక్నో మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్య
ఐపీఎల్ లో ఆదివారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో లక్నో జట్టుపై గుజరాత్ ఘన విజయం సాధించింది. వ‌ృద్ధిమాన్ సాహా, శుభ్ మన్ గిల్ చెలరేగడంతో గుజరాత్ 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో చతికిలపడిన లక్నో 171 పరుగుల దగ్గరే ఆగిపోయింది.

నిజానికి లక్ష్య ఛేదనలో లక్నో ఇన్నింగ్స్ మెరుగ్గానే సాగింది. 12.1 ఓవర్లకు 114 పరుగులు చేసి టార్గెట్ ను అందుకునేలానే కనిపించింది. ఆ తర్వాతే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, పూరన్, బదోని.. పెవిలియన్ కు క్యూ కట్టడంతో స్కోరు వేగం నెమ్మదించింది. దీంతో ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్ పై మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందించాడు. క్రిక్ బజ్ వెబ్ సైట్ లో మనోజ్ తివారీతో సెహ్వాగ్ మాట్లాడుతూ.. లక్నో టీమ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో నిర్ణయం ఎవరిదని లక్నో మేనేజ్ మెంట్ ను ప్రశ్నించాడు. 

‘‘10 ఓవర్ల తర్వాత టీమ్ స్కోరు 102-1. ఛేజింగ్ లో ఇలాంటి ఆరంభం దొరికినప్పుడు ఓడిపోయి ఉండకూడదు. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత ఫామ్ లో ఉన్న ఆటగాడు వస్తాడని అనుకున్నా. పూరన్, స్టోయినిస్, కృనాల్ పాండ్యా లేదా బదోని వస్తారని భావించా. గత మ్యాచ్ లలో వీళ్లు మంచి స్కోర్లు చేశారు. కానీ దీపక్ హుడాని పంపారు’’ అని సెహ్వాగ్ విమర్శించాడు.

‘‘200 పరుగులకు పైగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సరైన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎంచుకోవడంలో లక్నో పొరపడింది. నికోలస్ పూరన్, ఆయుష్ బదోనిని పంపాల్సింది. పూరన్ వచ్చి ఉంటే.. 20 బంతుల్లో 50 పరుగులు చేసే వాడు. మొత్తం ఆటే మారిపోయేది’’ అని అభిప్రాయపడ్డాడు.

‘‘హుడాను పంపి లక్నో పెద్ద తప్పు చేసింది. వాళ్లు ఆ సందర్భంలోనే మ్యాచ్ ను కోల్పోయారు. ఈ నిర్ణయం ఎవరది? కెప్టెన్ దా? కోచ్ దా? మేనేజ్ మెంట్ దా? మూడో స్థానంలో హుడాను పంపిందెవరు?’’ అని ప్రశ్నించాడు.
Virender Sehwag
Gujarat Titans
Lucknow Super Giants
Gautam Gambhir
Deepak Hooda

More Telugu News