Botsa Satyanarayana: అమరావతి అంటే ఆకాశంలో ఉంటుందా... ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు: బొత్స
- అమరావతిలో కేవలం ధనికులే ఉండాలంటే కుదరదన్న బొత్స
- ఇదేమైనా ప్రైవేటు స్థలమా లేక ప్రైవేటు వెంచరా అంటూ ఆగ్రహం
- అమరావతి అందరిదీ అని స్పష్టీకరణ
అమరావతిలో సామాన్యులు ఉండకూడదు... కేవలం ధనవంతులే పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని ఉండాలంటే కుదరదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతి ఏమైనా ప్రైవేటు స్థలమా? లేక, ప్రైవేటు వెంచరా? అమరావతి అంటే ఆకాశంలో ఉంటుందా ఏంటి? భూమ్మీదే కదా ఉండేది... ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. అమరావతిలో బిల్డింగ్ కట్టేందుకా 30 వేల ఎకరాలు ఇచ్చింది? అని బొత్స ప్రశ్నించారు.
కోర్టు తీర్పు వస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతుందే తప్ప, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోదు కదా, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించదు కదా అని అన్నారు.
ఈ సందర్భంగా బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఆయనదొక రాజకీయ పార్టీ. గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాడు. తహతహలాడుతున్నాడు, తపన పడుతున్నాడు... పడనీయండి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.