Jharkhand: ఝార్ఖండ్‌లో తెగబడిన దుండగులు.. బీజేపీ నేత సీఎం రమేశ్ మైనింగ్ కంపెనీకి చెందిన తెలంగాణ అధికారి మృతి

Telangana Officer working for NTPC shot dead in Hazaribagh

  • బైక్‌పై వెంబడించి కాల్పులు జరిపిన దుండగులు
  • మృతి చెందిన వీరగంధం శరత్‌బాబు
  • ఆయన అంగరక్షకుడి పరిస్థితి విషమం

ఝార్ఖండ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో నిన్న దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన మైనింగ్ అధికారి వీరగంధం శరత్‌బాబు (60) మృతి చెందారు. ఏపీ బీజేపీ నేత, మాజీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో శరత్‌బాబు పనిచేస్తున్నారు. నిజానికి ఆయన ప్రతిరోజు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తారు. 

నిన్న మధ్యాహ్నం సాధారణ వాహనంలో కార్యాలయానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెంబడించి దుండగులు హజారీబాగ్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శరత్‌బాబు, ఆయన అంగరక్షకుడు రాజేంద్ర ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా శరత్‌బాబు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజేంద్ర ప్రసాద్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

పోస్టుమార్టం అనంతరం శరత్‌బాబు మృతదేహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నట్టు హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ ఛోతే తెలిపారు. కాల్పుల తర్వాత దుండగులు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. శరత్‌బాబు స్వస్థలం నిజామాబాద్ జిల్లా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆయన కుమారుడు హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు.

  • Loading...

More Telugu News