Telangana: ఫెయిలయ్యామని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని మరికొందరు.. 8 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు
- రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న తిరుపతి విద్యార్థి
- ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని
- మనస్తాపంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన మరో విద్యార్థిని
ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొందరు, మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.
జగిత్యాలలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి (16) నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (బైపీసీ) చదువుతున్న ఆర్మూర్ విద్యార్థి (17) మూడు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
పటాన్‌చెరులో ఇంటర్ (ఎంపీసీ) చదువుతున్న తిరుపతికి చెందిన విద్యార్థి (17) ఫెయిల్ అవుతానన్న మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి-మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య అతడి మృతదేహం లభ్యమైంది.
హైదరాబాద్‌లో చదువుకుంటున్న గద్వాలకు చెందిన ఓ విద్యార్థి (17) ఇంటర్ ఫస్టియర్‌లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ ఇంటర్ (ఎంపీసీ) చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
సికింద్రాబాద్‌లో ఒకరు, ఖైరతాబాద్‌లో మరొకరు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకోగా, నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన అమ్మాయి (17) మార్కులు తక్కువగా (365) వచ్చాయన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, పటాన్‌చెరు సమీపంలోని పాటి గ్రామానికి చెందిన విద్యార్థిని భవాని ఇంటర్ సెకండియర్‌లో ఫెయిల్ అయిన మనస్తాపంతో అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.