MLC Kavitha: ద్వేషాన్ని తిరస్కరించండి: కర్ణాటక ఓటర్లకు ఎమ్మెల్సీ కవిత పిలుపు
- కర్ణాటకలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ట్వీట్
- సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచన
- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఓటర్లను ఉద్దేశించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తరిమికొట్టాలని కవిత కోరారు. ప్రియమైన కర్ణాటక ప్రజలారా.. ప్రజల్లో విద్వేషాన్ని పెంచే వారిని తిరస్కరించి, అభివృద్ధికి ఓటేయండి.. అంటూ ఎమ్మెల్సీ కవిత ఓటర్లకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. మొత్తం 224 నియోజకవర్గాల్లో 2,615 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.