Pakistan: పాకిస్థాన్ నటికి చెంపపెట్టులాంటి జవాబిచ్చిన ఢిల్లీ పోలీస్
- భారత ప్రధానిపై ఫిర్యాదు చేస్తానంటూ పాక్ నటి సెహర్ షిన్వారీ ట్వీట్
- ఢిల్లీ పోలీస్ శాఖ ఆన్ లైన్ లింక్ ఎవరికైనా తెలిస్తే చెప్పాలన్న షిన్వారీ
- పాకిస్థాన్ ఇంకా మా జ్యూరిస్ డిక్షన్ లోకి రాలేదంటూ ఢిల్లీ పోలీస్ జవాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదు చేయాలని ఉందంటూ ట్వీట్ చేసిన పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీకి ఢిల్లీ పోలీసులు చెంపపెట్టులాంటి జవాబిచ్చారు. పాకిస్థాన్ ఇంకా తమ జ్యూరిస్ డిక్షన్ లోకి రాలేదని అన్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి రేంజర్లు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఇమ్రాన్ ను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో దేశం అల్లకల్లోలంగా మారింది. ఇమ్రాన్ అభిమానులు, పీటీఐ పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెహర్ షిన్వారీ ట్విట్టర్లో స్పందిస్తూ.. పాకిస్థాన్ లో అల్లర్లకు కారణం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయేనని ఆరోపించారు. మోదీతో పాటు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ పైనా కేసు పెట్టాలని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఆన్ లైన్ లింక్ ఎవరికైనా తెలిస్తే చెప్పాలని ట్వీట్ లో షిన్వారీ విజ్ఞప్తి చేశారు. షిన్వారీ ట్వీట్ పై ఢిల్లీ పోలీస్ శాఖ స్పందించింది. అయ్యో.. పాకిస్థాన్ ఇంకా మా పరిధిలోకి రాలేదు అంటూ బదులిచ్చింది. పాకిస్థాన్ మొత్తం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే మీరెలా ట్వీట్ చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందని కౌంటర్ ఇచ్చింది.
షిన్వారీ ట్వీట్ కు నెటిజన్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. గూగుల్ చేయడం వచ్చా..? బ్రౌజర్, యూఆర్ఎల్.. అంటే తెలుసా లేక ఎప్పుడూ ట్విట్టర్ లోనే ఉంటావా అంటూ ఓ నెటిజన్ నిలదీశాడు. మరీ ఇంత దద్దమ్మలు కూడా ఉంటారా అంటూ మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఆమె పాకిస్థాన్ కు చెందిన నటి అని మర్చిపోయినట్టు ఉన్నావని మరో యూజర్ బదులిచ్చాడు. భవిష్యత్తులో మీరు చేసే ట్వీట్లు అర్థవంతంగా ఉండాలంటే భారతదేశంలోని ఏదైనా మంచి స్కూలులో చేరాలని మరో యూజర్ సలహా ఇచ్చారు.