Suryakumar Yadav: ముంబైతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తి
- ముంబై తరఫున సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్
- 35 బంతులకే 83 పరుగులు చేసి అవుట్
- సూర్యని హత్తుకుని, అభినందించిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ.. దూకుడు ప్రతి క్రికెట్ అభిమానికి పరిచయమే. మైదానంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు తరఫున కోహ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడంలో ముందుంటాడు. ప్రత్యర్థి జట్టు వికెట్ పడిన ప్రతిసారీ విపరీత ఆనందంతో ఊగిపోతుంటాడు. అలాంటి కోహ్లీ.. నిన్న ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తిని చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 196 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ను సూర్యకుమార్ తన దూకుడైన ఆటతో విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులతో వీర విహారం చేశాడు.
తాము బ్యాటింగ్ లో తక్కువ స్కోరు చేయడంతోపాటు, సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగే తమ ఓటమిని శాసించినట్టు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ సైతం అంగీకరించాడు. సూర్య కుమార్ యాదవ్ ను 16వ ఓవర్లో ఆర్సీబీ బౌలర్ విజయ్ కుమార్ వ్యాసక్ అవుట్ చేశాడు. స్టేడియం మొత్తం నించుని మరీ సూర్యకు మద్దతు పలికింది. విరాట్ కోహ్లీ అయితే సూర్యను హత్తుకుని, భుజం చరిచి అభినందించడం కనిపించింది. దీన్ని చూసిన అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో వేర్వేరు జట్లకు ఆడినా వీరిద్దరూ టీమిండియా క్రికెటర్లు కావడం తెలిసిందే!