motor Insurance: బీమా పాలసీలపై పెరగనున్న ప్రీమియం ధరలు
- త్వరలోనే 10-15 శాతం వరకు పెరగనున్న ప్రీమియం ధరలు
- ప్రాపర్టీ, లయబిలిటీ బీమా ప్రీమియం ధరల్లోనూ సవరణ
- రీ ఇన్సూరెన్స్ రేట్లలో భారీ పెరుగుదల
- దీంతో కస్టమర్లపై పడనున్న భారం
కొన్ని రకాల బీమా ప్లాన్లపై ప్రీమియం ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ముఖ్యంగా వాహన బీమా భారంగా మారనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ రీ ఇన్సూరెన్స్ సంస్థలకు క్లెయిమ్ లు పెరిగిపోయాయి. దీంతో రీ ఇన్సూరెన్స్ రేట్లు 40 శాతం నుంచి 60 శాతం మధ్య పెరిగాయని బీమా రంగ వర్గాలు వెల్లడించాయి.
ప్రతీ బీమా సంస్థ తన కస్టమర్లకు ఇచ్చే ప్రతీ కవరేజీపై తిరిగి రీ ఇన్సూరెన్స్ చేయించుకుంటాయి. అంటే కస్టమర్ల నుంచి క్లెయిమ్ లు వచ్చినా బీమా కంపెనీలు నష్టపోవు. మరీ ప్రతికూలతలు ఎదురైతే రీ ఇన్సూరెన్స్ బీమాతో అవి గట్టెక్కేస్తాయి. రీ ఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం రేట్లను పెంచడంతో, ఆ ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు సాధారణ బీమా సంస్థలు కొన్ని రకాల పాలసీలపై త్వరలోనే ప్రీమియం పెంచనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
వాహన, ప్రాపర్టీ, మెరైన్, లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియం సుమారుగా 10 శాతం వరకు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇళ్లు, వాణిజ్య భవనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వీటిపై 8-10 శాతం వరకు ప్రీమియం పెరగనుంది. ఊహించనంత నష్టం వాటిల్లిందని, దీంతో భారత బీమా సంస్థలకు రీ ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. రీ ఇన్సూరెన్స్ రేట్లు 40-60 శాతం పెరిగినట్టు చెప్పారు. ప్యాసింజర్ కార్లు, బైక్ లు, వాణిజ్య వాహనాల ప్రీమియం ధరలు వచ్చే కొన్ని నెలల్లో 10-15 శాతం పెరుగుతాయని పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొన్నారు.