Karnataka: ఓటు హక్కు వినియోగించుకున్న దేవెగౌడ, సిద్ధరామయ్య, యెడ్డీ
- 130-160 సీట్లు గెలుస్తామన్న సిద్ధరామయ్య
- బీజేపీ క్లియర్ మెజార్టీ సాధిస్తుందన్న యడియూరప్ప
- సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హసన్ లోని పోలింగ్ బూత్ లో వీరు తమ ఓటును వేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 60 శాతం ఓట్లను దక్కించుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 130 నుండి 160 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత, మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. కమలం పార్టీకి క్లియర్ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపాయన్నారు. శివమొగ్గ జిల్లాలోని శిఖారిపుర నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ఆయన తనయుడు విజయేంద్ర శికారిపుర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుందని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 2615 మంది బరిలో ఉన్నారు. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 42,48,028 మంది కొత్త ఓటర్లు జత కలిశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆరు గంటల వరకు క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసుకోవడానికి అవకాశమిస్తారు.