Nirmala Sitharaman: కాంగ్రెస్ పార్టీకి ద్రవ్యోల్బణంపై మాట్లాడే హక్కు లేదు: నిర్మలా సీతారామన్
- ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి నిర్మల
- బొమ్మై ప్రభుత్వం పెట్రోల్‌పై రెండుసార్లు సుంకాన్ని తగ్గించిందన్న ఆర్థికమంత్రి
- డబుల్ ఇంజిన్ సర్కార్ తో వృద్ధి పరుగులు పెడుతుందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీకి ద్రవ్యోల్బణంపై మాట్లాడే హక్కులేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యూపీఏ హయాంలో దేశంలో ద్రవ్యోల్బణం తీరును ప్రస్తావించారు. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కు ప్రశ్నించే హక్కు లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని, ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడకు మహిళలు, వృద్ధులు అందరూ తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం క్యూలో నిలుచున్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో వృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
తాను ప్రజల్లోనే ఉంటానని, కాబట్టి ధరలు మరింత తగ్గాల్సి ఉందని చెబుతున్నానని నిర్మలమ్మ అన్నారు. కానీ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే నైతిక హక్కు మాత్రం లేదన్నారు. ధరలు తగ్గించేందుకు 2014 నుండి మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. కర్ణాటకలో బసవరాజు బొమ్మై ప్రభుత్వం కూడా పెట్రోల్ పై రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు చెప్పారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.