Narendra Modi: జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన
- భారత ప్రధాని మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ఖరారు
- జూన్ 22న అమెరికాకు వెళ్లనున్న మోదీ
- మోదీకి ఆతిథ్యమివ్వనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- భారత ప్రధాని కోసం స్టేట్ డిన్నర్ ఏర్పాటు
- ఇండో పసిఫిక్, క్వాడ్ కూటమిపై ఇరు నేతల మధ్య చర్చ
భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన ఖరారైంది. జూన్ 22న మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. 2009లో చివరిసారిగా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాలో అధికారికంగా పర్యటించారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన్మోహన్ సింగ్‌కు సాదర స్వాగతం పలికారు. ఇక, 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఇప్పటివరకూ మోదీ ఐదు సార్లు అమెరికాలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మోదీ కోసం స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరు నేతలు ఈ పర్యటనలో చర్చించనున్నారు. అంతేకాకుండా, స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. మోదీ చేపట్టనున్న తొలి అధికారిక అమెరికా పర్యటన ఇదే కావడంతో ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే నెలల్లో జరగనున్న జీ7, క్వాడ్ సమావేశాల్లోనూ మోదీ, జో బైడెన్ పాల్గొంటారు.