bowel cancer: ఈ లక్షణాలు కనిపిస్తే పేగు కేన్సర్ గా అనుమానించాల్సిందే!
- కడుపులో అసాధారణ నొప్పి, ఎక్కువ సార్లు విరేచనం
- మలబద్ధకం, మూత్రం రంగు మారిపోవడం
- మలం, మూత్రంలో రక్తం పడడం, తీవ్ర అలసట
- ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
కడుపులో ఇటీవలి కాలంలో కొత్త మార్పులు ఏవైనా కనిపిస్తున్నాయా..? తరచూ మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోందా? కడుపులో నొప్పి లేదా జీర్ణానికి సంబంధించి ఏవైనా సమస్యలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో బవెల్ (పేగు) కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీన్నే కొలెరెక్టల్ కేన్సర్ అని కూడా అంటారు.
బవెల్ కేన్సర్ కేసులు పెరగడానికి జీవనశైలిలో మార్పులు ముఖ్య కారణంగా ఉంటున్నాయి. ఆల్కహాల్, పొగతాగడం, అధిక కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం, అధిక బరువు ఉండడం ఇవన్నీ రిస్క్ ను పెంచుతాయి. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని (పండ్లతోపాటు) తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం బవెల్ కేన్సర్ రిస్క్ తగ్గించుకునేందుకు ఆచరించాల్సినవి. సాధారణంగా పెద్ద పేగులో ఈ సమస్య కనిపిస్తుంది. ఏ వయసులో అయినా రావచ్చు కానీ, 40 ఏళ్ల వయసులో ఓ సారి స్క్రీన్ చేయించుకోవాలన్నది నిపుణుల సూచన.
కడుపులో అసాధారణమైన నొప్పి, ఊహించని విధంగా బరువు తగ్గడం, తీవ్ర అలసట, మలంలో రక్తం కనిపించడం, నీళ్ల విరేచనాలు లేదా ఎక్కువ సార్లు మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, వెళ్లొచ్చిన తర్వాత ఇంకా ఖాళీ కాలేదన్న భావన, కడుపుబ్బరం, మూత్రంలో రక్తం, మూత్రం తరచూ పోయాల్సి రావడం, మూత్రం రంగు చిక్కగా మారడం ఇవన్నీ సాధారణ సంకేతాలు కావు. ఇవి తరచుగా కనిపిస్తుంటే ఒక్కసారి వైద్యుల వద్దకు వెళ్లి సమస్యను నిర్ధారించుకోవాల్సిందే. దీర్ఘకాలం పాటు అల్సర్లతో బాధపడేవారికి కూడా రిస్క్ ఉంటుంది.