Uddhav Thackeray: ఆ నిర్ణయం తప్పే కానీ... ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న సుప్రీంకోర్టు
- మహా రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదన్న ధర్మాసనం
- సమాచారం లేనప్పుడు సభలో మెజార్టీని నిరూపించుకోమనడం సబబు కాదని వ్యాఖ్య
- ఉద్ధవ్ రాజీనామా నేపథ్యంలో షిండే ప్రమాణ స్వీకారం సమర్థనీయమన్న సుప్రీం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని, అయినప్పటికీ ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్చందంగా రాజీనామా చేయడమే ఇందుకు కారణమని తెలిపింది.
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ థాకరే వర్గం, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఉద్ధవ్ మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు రావడానికి గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు సభలో మెజార్టీని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సరికాదని, కానీ ఉద్ధవ్ బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని కోర్టు తెలిపింది. థాకరే రాజీనామా చేయడంతో అప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు కలిగిన షిండే వర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సమర్థనీయమేనని పేర్కొంది.