Jagan: జగన్ పై కోడి కత్తితో దాడి కేసు విచారణ జూన్ 15కి వాయిదా
- గత ఎన్నికల సమయంలో జగన్ పై కోడి కత్తితో దాడి
- దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ
- నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ
- రెండు పిటిషన్లు దాఖలు చేసిన సీఎం జగన్
- కౌంటర్లు దాఖలు చేసిన నిందితుడు శ్రీనివాస్, ఎన్ఐఏ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో, నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఓ పిటిషన్, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
అటు, నిందితుడు శ్రీనివాస్, ఎన్ఐఏ నుంచి కూడా కౌంటర్లు దాఖలయ్యాయి. జగన్ పై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న పిమ్మట కేసు విచారణను న్యాయమూర్తి జూన్ 15కి వాయిదా వేశారు.