Jagan: రాయలసీమ విషయంలో జగన్ మైండ్ పనిచేయడం లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
- చిల్లర ప్రాజెక్టులు చూపించి ఏదో చేస్తున్నట్లు చెబుతున్నారన్న బైరెడ్డి
- రాయలసీమపై జగన్ కు చిత్తశుద్ధి లేదని విమర్శ
- ప్రజల్లో చైతన్యం కోసం సంతకాల సేకరణ చేపడుతున్నట్లు వెల్లడి
చిల్లర ప్రాజెక్టులు చూపించి రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు జగన్ చెబుతున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చారా? అని ప్రశ్నించారు. రాయలసీమ విషయంలో జగన్ మైండ్ పనిచేయడం లేదని విమర్శించారు. రాయలసీమపై ఆయనకు చిత్తశుద్ధి లేదన్నారు. రాయలసీమను అంటరానిదిగా ఇక్కడి నాయకులు మార్చారన్నారు.
రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివి ఇతర రాష్ట్రాలలో కూలి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పర్ భద్ర, తీగల వంతెన.. రాయలసీమకు ఉరితాడు లాంటివని ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ రాయలసీమకు ఎంతో ముఖ్యమైనదని.. దీని గురించి ఎవరూ మాట్లాడరని మండిపడ్డారు. 70 నుంచి 80 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ తమకు కావాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ నెల 14వ తేదీ నుంచి 21 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. సంతకాల సేకరణ తర్వాత ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. రెండో దశ ఉద్యమంలో భాగంగా ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని బైరెడ్డి తెలిపారు.