Surahi Vs Fridge: ఫ్రిడ్జ్ కంటే మట్టి కుండ ఎందుకు మంచిది?: ఆనంద్ మహీంద్రా
- పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తిగా పేర్కొన్న ఆనంద్ మహీంద్రా
- కుండను కోరుకుంటే మనవళ్లకు కూడా ఇవ్వొచ్చని వెల్లడి
- ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని గుర్తు చేసిన పారిశ్రామికవేత్త
వేసవి ఎండల వేడి గరిష్ఠాలకు చేరుతోంది. మండే ఎండల్లో కాస్తంత చల్లటి నీరు తాగాలని చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ కాలంలో రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి. కానీ, ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఒక్క ఇంటిలో మట్టి కుండలు కనిపించేవి. అందులో పోసుకుని మంచి నీటిని చల్లగా తాగేవారు. కానీ, నేడు పల్లెల్లోనూ రిఫ్రిజిరేటర్లే పలకరిస్తున్నాయి. వంటికి మంచి చేసే మట్టి కుండను మర్చిపోతున్న ప్రజలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సారి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రిఫ్రిజిరేటర్ కంటే కుండ ఎన్ని విధాలుగా మంచిదో తెలియజేశారు.
‘‘నిజానికి సురాహి (మట్టి కుండ) డిజైన్, అందం కోణం నుంచి చూసినా రిఫ్రిజిరేటర్ కంటే మెరుగైనది. భూమండలానికి అనుకూలంగా వ్యవహరించడం ఎలాగా? అన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, అణుకువగా ఉండే సురాహి ఉన్నతమైన జీవనశైలి ఉత్పత్తి అవుతుంది’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా పేర్కొన్న వ్యత్యాసాలు
మట్టి కుండ | ఫ్రిడ్జ్ |
నీటిని చల్లగా చేస్తుంది | నీటిని చల్లగా చేస్తుంది |
వ్యయం రూ.200 | వ్యయం రూ.10వేలకు పైనే |
జీవిత కాలం పాటు ఉంటుంది. మనవళ్లకు కూడా ఇవ్వొచ్చు. | మహా అయితే 7-15 ఏళ్ల వరకే పనిచేస్తుంది. |
నిర్వహణ వ్యయం తక్కువ. | నిర్వహణ వ్యయం ఎక్కువ. విద్యుత్ ను వినియోగించుకుంటుంది. |
ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. | అంత సులభం కాదు |
దూదో కీ మలై వాహి మిట్టి కీ సురాహి రాస్తా దేఖే అంటూ అర్జిత్ సింగ్ పాడాడు. | ఫ్రిడ్జ్ గురించి అర్జిత్ సింగ్ అసలు పాడలేదు. |