Karnataka: కర్ణాటకలో మొదలైన క్యాంపు రాజకీయాలు
- బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు కాంగ్రెస్ పిలుపు
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ క్యాంపులోనే ఉండాలని సూచన
- ఆపరేషన్ లోటస్ భయంతో జాగ్రత్తపడుతున్న అధిష్ఠానం
కర్ణాటక ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీకే మెజారిటీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పార్టీ అభ్యర్థులను క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు రావాలంటూ తప్పకుండా గెలుస్తారని భావిస్తున్న కేండిడేట్లకు ఇప్పటికే ఆదేశాలు పంపినట్లు సమాచారం. సిటీలోని ఓ రహస్య ప్రదేశంలో వారు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలు వెలువడి, ప్రభుత్వం ఏర్పడే దాకా అక్కడే ఉండాలని వారికి సూచించారు.
మెజారిటీకి కాస్త అటూఇటూగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ లోటస్ భయంతో, తమ కేండిడేట్లు చేజారిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తప్పకుండా మనకే వస్తుందని, ప్రత్యర్థులు చేసే ప్రలోభాలకు లొంగిపోవద్దని కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ అభ్యర్థులను హెచ్చరించినట్లు తెలిపాయి.