Imran Khan: భూకబ్జా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 2 వారాల మధ్యంతర బెయిల్
- భద్రతా కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా విచారణ
- ఇమ్రాన్ ఖాన్‌పై పదికి పైగా అరెస్ట్ వారెంట్లు
- ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసే ఛాన్స్
భూకబ్జా కేసులో అరెస్టైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. రెండు వారాల మధ్యంతర బెయిల్ ను ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసింది. అయితే ఆయనపై పదికి పైగా అరెస్ట్ వారెంట్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇమ్రాన్ ఖాన్ ను ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేయడంపై ఆ దేశ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.
జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమాన్ రఫాత్ ఇంతియాజ్ తో డివిజన్ బెంచ్ ఆల్ ఖదీర్ ట్రస్ట్ కరప్షన్ కేసుపై విచారణ జరిపింది. ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు ఉదయం గం.11.30 సమయానికి భారీ భద్రత నడుమ హైకోర్టుకు హాజరయ్యాడు. భద్రతా కారణాల వల్ల విచారణ రెండు గంటలు ఆలస్యమైంది. కోర్టు ప్రాంగణంలో కొంతమంది ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇద్దరు జడ్జిలు కూడా కాసేపు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత సాయంత్రం ఆయనకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.